నోటిఫికేషన్లు వస్తాయా? రావా? చదవాలా? వద్దా?
Telangana job notifications: నోటిఫికేషన్లు వస్తాయా? రావా? చదవాలా? వద్దా?
ప్రస్తుతం తెలంగాణ నిరుద్యోగుల్లో ఒకటే సందేహం. ఇంతకీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లుTelangana job notifications ఇస్తుందా? ఇవ్వదా? నేను ఇంకెన్ని రోజులు చదవాలి? ఎస్సీ వర్గీకరణ నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తారా? పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ లతో నోటిఫికేషన్లలో జాప్యం జరుగుతుందా? ఇలా ఎన్నెన్నో సందేహాలు నిరుద్యోగుల మదిని తొలుస్తున్నాయి. నాలుగైదు ఏండ్లుగా ప్రిపరేషన్ లోనే ఉన్నా గత నోటిఫికేషన్లలో జాబ్ సాధించలేని వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికీ ఇంకా ఏ జాబ్ లో స్థిరపడకపోవడం, ఆర్థిక సమస్యలు, ఇంట్లో వారికి, బంధువులకు ఏం చెప్పాలో తెలియక మనసులోనే కుంగిపోతున్నారు. మళ్లీ ప్రిపరేషన్ మొదలుపెడితే ఇంకెంత కాలం చదవాల్సి ఉంటుందా? ఈ సారైన సజావుగా పరీక్షలు నిర్వహిస్తారా? అనే అనుమానాలు ప్రతీ ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయి. దాదాపు అందరి పరిస్థితి ఇదే.
ప్రభుత్వంలో ఏం జరుగుతోంది?
ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు అందరూ తమ హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. 26వ తేదీ నుంచి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు.. వంటి పథకాలను అమలు చేసే పనిలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈనెలాఖరు దాక ఇదే పరిస్థతి నడుస్తుంది. ఫిబ్రవరిలో ఎస్సీ వర్గీకరణ నివేదిక ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చు. అంటే ఫిబ్రవరి, మార్చిలో ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే ప్రభుత్వం ఉద్యోగాలు వేసేందుకు సిద్ధంగానే ఉన్నట్టే తెలుస్తోంది. అయితే జాప్యం మాత్రం తప్పేలా లేదు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ నివేదిక రావాలి. దాన్ని బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించాలి. దాని ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలకు పంపాలి. ఆమేరకు ఉద్యోగాలను కేటాయించాలి. ఇందుకు ఏప్రిల్ నెల వరకు సమయం పట్టవచ్చు.
టీజీపీస్సీ ఏం చెబుతోంది?
ఆ మధ్య టీజీపీస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ మే నుంచి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పరీక్షల ప్రాధాన్యాన్ని బట్టి 6 నుంచి 9 నెలల కాలంలో వాటిని భర్తీ చేస్తామని చెప్పారు. సిలబస్ మార్పు, తగ్గింపు..ఇలా పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాటలు నిజమైతే మనకు మే నుంచే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మేలో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత గ్రూప్-2, 3 వరుసగా రానున్నాయి. ఎన్నికల కోడ్ లు, ప్రభుత్వ జాప్యం లేకపోతే చైర్మన్ చెప్పినట్టుగానే జరుగొచ్చు. మనం కూడా అదే ఆశించాలి కాబట్టి..మేనుంచి నోటిఫికేషన్లు వస్తాయని అనుకోవాల్సిందే.
మనమేం చేయాలి?
మొదటగా మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోండి. ఫ్రెషర్స్ కు పెద్దగా బాధ ఉండదు కానీ గత దశాబ్ద కాలంగా చదువుతున్న సీనియర్ ఆస్పిరెంట్స్ కొంచెం ఆలోచించుకునే నిర్ణయం తీసుకోవాలి. ఆర్థికంగా, కుటుంబ పరంగా ఏ బాధ లేదనుకుంటే రోజుకు 8-10 గంటలు ఇప్పటి నుంచే చదవడం బెటర్. ఆర్థిక, ఇతరత్రా బాధలు ఉంటే మాత్రం ఏదైనా పార్ట్ టైం, ఫుల్ టైమ్ జాబ్ చేస్తూనో చదవాల్సిందే. ఎందుకంటే మే నెల రావడానికే ఇంకా నాలుగు నెలలు ఉంది. ఆ తర్వాత నోటిఫికేషన్లు పడి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత లేదన్నా 7-9 నెలలు పట్టవచ్చు. అంటే మరో 12-15 నెలల దాక మనం ఈ ప్రక్రియలోనే ఉండాల్సి ఉంటుంది. మరి సీనియర్ అభ్యర్థులు ఆలోచించుకోవాలి. ఏదైనా జాబ్ చేస్తూ చదవడం బెటర్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రక్రియలో ఎప్పుడేం జరిగేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా మనం చూస్తున్నదే. అందుకే సీనియర్ అభ్యర్థులు ప్లాన్ బీ చూసుకుని చదివితే బెటర్. ఇక ఫ్రెషర్స్ ఇప్పుడే వస్తారు కాబట్టి వారికి ఏ ఇబ్బంది ఉండదు. సీనియర్ అయిన, జూనియర్ అయిన ప్రిపరేషన్ ఇక మొదలుపెడితేనే మంచిది. నోటిఫికేషన్లు వచ్చే సరికి రోజుకు నాలుగైదు గంటలైనా చదివితే మంచిది. నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ మొదలు పెట్టిన వారికే మంచి అవకాశాలు ఉంటాయి.
గత తప్పులు మళ్లీ చేయవద్దు..
ముఖ్యంగా సీనియర్ అభ్యర్థులు గత పరీక్షల్లో ఏ తప్పులు చేశారో..వాటిని ఇప్పుడు సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఏండ్ల తరబడి కాలం వేస్ట్ చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే మన వైపు నుంచి ఏ తప్పు లేకుండా చూసుకోవాలి. ఏ చిన్న అంశాన్ని సైతం వదిలిపెట్టకుండా చదవాల్సిందే. ముఖ్యంగా గత నోటిఫికేషన్లలో నాన్ మ్యాథ్స్, తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని నష్టం జరిగింది. ఎందుకంటే గ్రూప్-2,3 ల్లో మొదటి పేపర్లలో ఇంగ్లీష్, డాటా, రీజనింగ్ విభాగాల్లో సుమారు 50 మార్కుల దాక ఇచ్చారు. పేపర్లు లెంతీగా ఉండడం వల్ల ఈ విభాగాలను చేయడానికి టైమ్ సరిపోలేదు. తద్వారా జీఎస్ లో అతి తక్కువ మార్కులు వస్తుండడం వల్ల ఉద్యోగానికి దూరమవుతున్నారు. అందుకే ఈ విభాగాలపై కచ్చితంగా ఇప్పటి నుంచే నజర్ వేయాల్సిందే. రోజుకు గంటో, రెండు గంటలో వీటికి కేటాయించాలి. అలాగే ఓ గంట కరెంట్ అఫైర్స్ కు కేటాయించాల్సిందే. ఈ మూడింటిలో గరిష్ఠ మార్కులు తెచ్చుకున్నవారికే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయనే విషయం మొన్నటి పరీక్షలు రాసిన వారికే అర్థమయ్యే ఉంటుంది. అందుకే ప్రిపరేషన్ తీరు మారాలి. రొట్టకొట్టుడు చదువులు పక్కనపెట్టి క్వాలిటీ ప్రిపరేషన్ కు ప్రాధాన్యం ఇవ్వాలి.
2025లో ఉద్యోగం కొట్టాలంటే..
ఇక తప్పదు..కష్టమో నష్టమో ఈ రంగంలోకి వచ్చాం. ఈసారన్నా జాబ్ కొట్టుకుని భవిష్యత్ ను పునర్ నిర్మించుకోవాల్సిందే. నోటిఫికేషన్లు ఓ నెల అటు ఇటు అయినా రావడం మాత్రం పక్కా. ఎందుకంటే ప్రభుత్వం, టీజీపీస్సీ పోస్టులు భర్తీ చేసేందుకే ఆసక్తి చూపుతున్నాయి. కాకపోతే కొంత లేటుగా ప్రాసెస్ జరుగొచ్చు. దానికి సిద్ధపడే ప్రిపరేషన్ లోకి దిగాలి. ఇక రంగంలోకి దిగితే మనసులో నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి. ప్రిపరేషన్ అందరికంటే ముందుగా మొదలుపెట్టిన వారికే మెరుగైన అవకాశాలు ఉంటాయనేది మరువొద్దు. ఈ ఏడాదైనా ఉద్యోగ నామ సంవత్సరం కావాలని కోరుకుందాం.
మరిన్ని విద్యా, ఉద్యోగ, ఉపాధి వార్తలకు Telugu job motivators.comను చదవండి